గుర్తింపు శూన్యం.. అయినా లక్షల్లో ఫీజుల వసూళ్ల పర్వం
7వ తరగతి పర్మిషన్తో 10వ తరగతి బోర్డు దాకా దందా
ఉప్పల్ ఎంఈఓ రామారావు అక్రమాలు.. మామూళ్ల మత్తులో విద్యాశాఖ?
ఉప్పల్ అక్టోబర్ 06 (వార్త వేకువ)’
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరు కంచె చేను మేసిన చందంగా తయారైంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేయాల్సిన విద్యాశాఖ, ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమ దందాలకు అభయహస్తం అందిస్తోంది. అధికారుల అండదండలు, మామూళ్ల మత్తులో ప్రైవేట్ యాజమాన్యాలు సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులను గుల్ల చేస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన చదువునందిస్తారనే నమ్మకంతో వస్తున్న నిరుపేద కుటుంబాల ఆశలను ఆసరాగా చేసుకుని, ఉప్పల్ భగాయత్లోని ‘శ్లోక పాఠశాల’ వందలాది మంది విద్యార్థుల జీవితాలతో బరితెగించి ఆడుకుంటోంది.
ఈ పాఠశాల యాజమాన్యానికి కనీస సీబీఎస్ఈ (C.B.S.E) గుర్తింపు కూడా లేదు. అయినా సరే, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన పేరిట అక్రమంగా తరగతులు నిర్వహిస్తూ తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు గుంజుతోంది. ప్రభుత్వం నుంచి కేవలం 7వ తరగతి వరకు మాత్రమే స్టేట్ సిలబస్ అనుమతులు ఉన్నప్పటికీ, అధికారుల కళ్లు గప్పి 10వ తరగతి వరకు తరగతులు నడుపుతూ దందాను విస్తరించింది. రేపటి రోజున బోర్డు పరీక్షల సమయంలో గుర్తింపు లేక విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదమున్నా, చదువును వ్యాపారంగా మార్చి నిలువునా మోసం చేస్తోంది.
ఇంతటి ఘోరం కళ్లెదుటే జరుగుతున్నా స్థానిక ఉప్పల్ ఎంఈఓ రామారావు చోద్యం చూడటం వెనుక భారీ స్థాయి ముడుపుల కథ నడుస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనలను బొందపెట్టి స్కూల్ నడుపుతున్నా ఎంఈఓగానీ, యాజమాన్యంగానీ పెదవి విప్పకపోవడం లాలూచీ రాజకీయాలకు అద్దం పడుతోంది. అమాయక విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి అక్రమ వసూళ్లకు తెగబడుతుంటే విద్యాశాఖ మౌనం వహించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
వందలాది మంది చిన్నారుల చదువు పణంగా మారుతుంటే, విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు నిద్రమత్తులో ఉన్నారా అని బాధితులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ వెంటనే మేల్కొని శ్లోక పాఠశాల అక్రమ గుర్తింపుల భాగోతంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, ఈ దందాలో భాగస్వాములైన యాజమాన్యంతో పాటు ముడుపులకు కక్కుర్తి పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.